వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈడీ, సీబీఐ విచారణలు ముమ్మరం కావడంతో భయపడి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ ధర్నాల పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. సొంత బాబాయ్ గొడ్డలిపోటుకు గురైతే గుండెపోటుగా చిత్రీకరించే యత్నం చేశారని, రూ.40 కోట్ల సుపారీ లావాదేవీలన్నీ తాడేపల్లి నివాసం వైపే వేలెత్తి చూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
మరణించిన ఉపాధ్యాయుడు రాజశేఖర్ ఉదంతంపై కూడా వైసీపీ శవ రాజకీయం చేస్తోందని మంత్రి విమర్శించారు. తప్పులు చేస్తూ ఎదురుదాడికి దిగే వైసీపీ తన పేరును ‘గొడ్డలి డైవర్షన్ పార్టీ’గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. వివేకా హత్య కేసుపై జగన్ మీడియా ముందుకు వచ్చి నిజాలు చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు, సచివాలయ ఉద్యోగుల సమస్యలను తమ ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.

