Breaking News

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత!

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో అంతర్రాష్ట్ర గంజాయి రవాణా గుట్టు రట్టయింది. ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.82 కోట్ల విలువైన 365.2 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా గంజాయిని తరలిస్తున్న బైక్, హ్యుందాయ్ కారు, లారీలను సీజ్ చేయడంతో పాటు, ఒడిశాకు చెందిన దివాకర్ మండల్, సుమన్ పాల్, రాజశేఖర్ మార్గి, బ్రిజన్ నాస అనే నలుగురు నిందితులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముందుగా ఒక బైక్‌ను తనిఖీ చేసి 9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు, దర్యాప్తును వేగవంతం చేసి అనంతరం కారులో 100 కిలోలు, లారీలో మరో 263.2 కిలోల గంజాయిని కనుగొన్నారు. ఒకే నెట్‌వర్క్‌కు చెందిన వీరు పైలటింగ్ కోసం బైక్‌ను, ప్రధాన రవాణాకు కారు, లారీలను ఉపయోగించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సరఫరా వెనుక ఉన్న ముఖ్య సూత్రధారులు ఎవరు, మహారాష్ట్రలో ఈ సరుకును ఎవరికి అప్పగించాల్సి ఉందనే కోణంలో నిందితుల కాల్ రికార్డులు, డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తూ ఎక్సైజ్ బృందాలు సమగ్ర విచారణ జరుపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *