Breaking News

‘గుంజకు కట్టి కొట్టినా తప్పులేదు’: కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఆయన కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అడ్డం పెట్టుకుని రూ. లక్ష కోట్ల భారీ అవినీతికి కేసీఆర్ డిజైన్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణానికి సూత్రధారి ప్రతిమా శ్రీనివాస్ అని ఆరోపించారు.

ప్రపంచంలో ఎక్కడైనా ముడిసరుకు లభించే ప్రాంతంలోనే పరిశ్రమలు స్థాపిస్తారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం బొగ్గు లభించే చోట కాకుండా కృష్ణా నదీ పరీవాహక ప్రాంతమైన దామరచర్లలో యాదాద్రి ప్లాంట్‌ను నిర్మించిందని విమర్శించారు. దీనివల్ల రూ.28 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వ్యయం రూ.37,800 కోట్లకు పెరిగిందని, అంటే అదనంగా రూ.9,800 కోట్లు భారం పడిందని వివరించారు. 40 ఏళ్లలో రూ. లక్ష కోట్ల అవినీతి కోసమే ఈ ప్లాంట్‌ను కేసీఆర్ డిజైన్ చేశారని రేవంత్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టును గ్రేడ్-9 బొగ్గుతో నడిచేలా రూపొందించి, ఏటా 14 మిలియన్ టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకునేలా ప్రణాళిక వేశారని మండిపడ్డారు. ఇంత పెద్ద అవినీతికి పాల్పడిన కేసీఆర్‌ను, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని దామరచర్లలో గుంజకు కట్టేసి కొట్టినా తప్పులేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాకే ఒడిస్సాలోని నైనీ గని నుంచి బొగ్గు తెచ్చి రైతులకు విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.

బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుపై కూడా రేవంత్ ఘాటుగా స్పందించారు. “క్షుద్రపూజలు చేసేవాళ్లు కూడా నీతులు చెబితే తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారు? మంత్రగాళ్లు, నేరగాళ్లను నమ్మాల్సిన పని లేదు” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం ఇసుక, బొగ్గు, భూములు, డ్రగ్స్‌, గంజాయి, కొకైన్‌ ఇలా దేన్నీ వదల్లేదని ఆరోపించారు. ఆంధ్రాలోని కాలేజీలు, ఆసుపత్రులకు పాలు సరఫరా చేసే వ్యాపారం హరీశ్‌రావు చూసుకుంటే, విదేశీ విస్కీ వ్యాపారాన్ని సంతోష్ రావు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో ‘టానిక్’ పేరుతో ప్రత్యేక పర్మిషన్‌తో వ్యాపారం నడుపుతున్నారని, దేశంలో ఇలాంటి అనుమతి ఉన్నది అదొక్కటేనని రేవంత్ రెడ్డి విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *