సింగరేణి బొగ్గు టన్నుకు రూ.3,800 అందుబాటులో ఉండగా, విదేశాల నుంచి టన్నుకు రూ.9,000 పెట్టి బొగ్గును దిగుమతి చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ‘తుగ్లక్ నిర్ణయం’గా అభివర్ణించిన ఆయన, ఎవరి స్వలాభం కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నారని, ప్రజలపై ఈ భారాన్ని ఎందుకు మోపుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బొగ్గుతోనే రాష్ట్రానికి 24 గంటల విద్యుత్‌ను నిరంతరాయంగా అందించామని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.
తెలంగాణ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తీవ్ర బొగ్గు కొరత నెలకొనడంతో ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి దాదాపు 50 లక్షల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 50 లక్షల టన్నుల బొగ్గు దిగుమతి వల్ల ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.3,000 కోట్ల భారం పడనుండటంతో పాటు, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరుగుతాయని జెన్కో ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

