దసరా పండుగను తమ సొంతూళ్లలో జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుండటంతో శనివారం హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. పెద్ద అంబర్‌పేట్ వరకు వాహనాలు సాఫీగా సాగినప్పటికీ, వాలిగొండ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండటం, ఒక్కసారిగా వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో ట్రాఫిక్ పూర్తిగా మందగించింది.
దీంతో వాహనాలు నత్తనడకన సాగాయి. సమయానికి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలనుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికులు సాఫీగా తమ ఊళ్లకు చేరుకునేలా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

