ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ, ఆవిష్కరణలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో నేడు ‘పాన్‌ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్–2026’ వైభవంగా జరగనుంది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. దేశంలోని 23 ఐఐటీలకు చెందిన గ్లోబల్ అలుమ్ని నెట్‌వర్క్‌ను రాష్ట్ర అభివృద్ధికి అనుసంధానించడం, పరిశ్రమలు-ప్రభుత్వం-ఐఐటీల భాగస్వామ్యంతో టెక్నాలజీ ఆధారిత పెట్టుబడులు, స్టార్టప్‌లు, పరిశోధనలను ప్రోత్సహించడం ఈ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం.
ఈ సదస్సులో అమరావతి పాన్‌ఐఐటీ కౌన్సిల్, డీప్‌టెక్ ఇన్వెస్ట్‌మెంట్ మెకానిజం, గ్లోబల్ ఐఐటీ మెంటార్ నెట్‌వర్క్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ వ్యవస్థలతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్‌కు చెందిన ‘క్యూ-శివ’ సాంకేతిక సామర్థ్యాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో ‘ఆంధ్రా పాన్‌ఐఐటీ డిక్లరేషన్’ విడుదల చేయడంతో పాటు పెట్టుబడులు, యువతకు ఉద్యోగ-సాంకేతిక అవకాశాలపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్, క్వాంటమ్ రంగాలకు బలమైన పునాది వేసేందుకు ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

