హైదరాబాద్‌కు చెందిన ఓ దంత వైద్యుడు ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో జరిగిన భారీ సైబర్ మోసంలో ఏకంగా రూ. 14.61 కోట్లు కోల్పోయారు. మోనికా మాధవ్ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ.. రోజుకు రూ. 4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నానని నమ్మించి, అతడిని టెలిగ్రామ్ ద్వారా నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి దించింది. మొదట రూ. 30 లక్షల పెట్టుబడికి లాభం వచ్చినట్లు చూపి, అందులో రూ. 85 వేలు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించి తీవ్రంగా నమ్మకాన్ని పెంచింది. ఆ తర్వాత రూ. 10 కోట్లు పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపడంతో, బాధితుడు విడతల వారీగా రూ. 14.61 కోట్లు ఆన్ లైన్‌లో బదిలీ చేశాడు.
స్క్రీన్‌పై ఏకంగా రూ. 34 కోట్ల లాభం కనిపించడంతో డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు బాధితుడు ప్రయత్నించగా, విత్‌డ్రా ఆప్షన్ పని చేయలేదు. పన్నుల పేరుతో మరో రూ. 7.5 కోట్లు చెల్లించాలని కస్టమర్ కేర్ కోరడం, అతనికి పరిచయమైన మహిళ కాంటాక్ట్‌లను బ్లాక్ చేయడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన వైద్యుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితుడి నుంచి డబ్బు వెళ్లిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడానికి, ఈ అంతర్రాష్ట్ర సైబర్ ముఠా నెట్‌వర్క్‌ను ఛేదించడానికి దర్యాప్తును వేగవంతం చేశారు. సోషల్ మీడియాలో అపరిచితులు ఇచ్చే ఆన్‌లైన్ పెట్టుబడుల ఆఫర్లను నమ్మవద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే ‘1930’ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

