ఢిల్లీ-ఎన్సిఆర్ పరిధిలో మహిళలు, మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడి ఘటనలపై సుప్రీంకోర్టు సోమవారం (అక్టోబర్ 5, 2026) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల భద్రతపై దాఖలైన సుమోటో పిటిషన్ను విచారించిన జస్టిస్ జె.బి. పార్డీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ల ధర్మాసనం.. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, నేరం జరగకుండా అడ్డుకోవడమే అత్యంత కీలకమని స్పష్టం చేసింది. నేరాలకు ఒడిగట్టే రౌడీలు, అరాచక శక్తుల మనస్సుల్లో పోలీసు వ్యవస్థ పట్ల భయం పుట్టించాలని ఢిల్లీ పోలీసులకు అత్యున్నత న్యాయస్థానం దిశానిర్దేశం చేసింది.
రాత్రి 11 గంటల సమయంలోనూ మెట్రో లేదా రహదారులపై ప్రయాణించే ప్రతి మహిళ సురక్షితంగా భావించే వాతావరణం కల్పించాలని ఆదేశించింది. ఇటీవల ఆస్థా కుంజ్ పార్క్లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, స్వరూప్ నగర్ లో బాలికపై అత్యాచారం, హత్యతో పాటు గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీ వరకు 47 కిలోమీటర్ల మేర బస్సులో మైనర్పై జరిగిన లైంగిక దాడి ఘటనలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. ఇది శాంతిభద్రతల వ్యవస్థ వైఫల్యమేనని నిరసించింది. సమాజంలో అత్యాచారం వంటి నేరాలకు ఏమాత్రం తావులేదని స్పష్టం చేస్తూ తదుపరి చర్యలపై ఆదేశాలు జారీ చేసింది.

