న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల తమను అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశారని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా నిరాకరించారని విమర్శించారు. తన నానమ్మ మరణించిన విషాద సమయంలో కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు లేదా న్యాయవాదులను సంప్రదించేందుకు అనుమతించలేదని, బలవంతంగా అరెస్టు పత్రాలపై సంతకాలు చేయించేందుకు యత్నించారని ఆరోపించారు. తమ డిటెన్షన్కు సంబంధించిన అసలు నిజాలు బయటకు రావాలంటే ఎలాంటి ఎడిటింగ్ లేని సీసీటీవీ దృశ్యాలను బయటపెట్టాలని పోలీసులకు సవాల్ విసిరారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ చేపడుతున్న ఈ పోరాటంపై ఎంతటి ఆంక్షలు విధించినా, హెచ్చరికలు జారీ చేసినా తాము వెనకడుగు వేసేదే లేదని దీప్కే స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం, పాలనాపరమైన పారదర్శకత మరియు ఓటర్ల జాబితా అక్రమాలపై తమ యువజన ఉద్యమం మరింత తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని, ఇలాంటి అణచివేత చర్యలకు తాము భయపడేది లేదని తేల్చి చెప్పారు.

