ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తన కుటుంబం నుంచి మరో రాజకీయ వారసురాలిని రంగంలోకి దించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తన కోడలు బొత్స పూజితను విజయనగరం జిల్లా గరివిడి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరుతూ బొత్స సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా ఓటర్లకు స్వయంగా విజ్ఞప్తి చేశారు.
తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకితమై ఉందని, అదే స్ఫూర్తితో తన కోడలు పూజిత సైతం మండల ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రాంతాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని బొత్స తెలిపారు. “పూజితను మీ ఇంటి ఆడబిడ్డగా భావించి, ఓటు వేసి ఆశీర్వదించండి” అని కోరుతూ ఆమె ప్రచార పోస్టర్ను షేర్ చేశారు. పార్టీ గుర్తు ‘ఫ్యాన్’ తో కూడిన ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్గా మారింది. సీనియర్ నేతగా ఉన్న బొత్స తన కోడలిని రాజకీయాల్లోకి తీసుకురావడంతో గరివిడి మండలంలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది.

