Breaking News

SBI తర్వాత HDFC డేటా లీక్ కలకలం… ఇద్దరు అధికారులపై ఆరోపణ

ముంబై: దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అంతర్గత విచారణ కలకలం రేపింది. బ్యాంకుకు చెందిన ఇద్దరు సీనియర్‌ అధికారులు వ్యాపార వ్యూహాలు, మార్కెట్‌పై ప్రభావం చూపగల సున్నితమైన సమాచారాన్ని బయటి వ్యక్తులకు చేరవేసినట్లు దర్యాప్తులో ఆధారాలు లభించాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం దుర్వినియోగమైందా? దానివల్ల బ్యాంకుకు లేదా మార్కెట్‌కు ఏమైనా నష్టం జరిగిందా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. ప్రాథమిక విచారణలో గుర్తించిన అంశాలను ఈ ఏడాది ప్రారంభంలోనే ఉన్నతాధికారులకు, బోర్డు సభ్యులకు వెల్లడించడమే కాకుండా సంబంధిత అధికారులకు కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయ్యాక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నైతిక విలువలు, పాలనా ప్రమాణాల విషయంలో రాజీపడబోమని బ్యాంకు ప్రతినిధి స్పష్టం చేశారు.

ఈ పరిణామం బ్యాంకు సీఈఓ మార్పునకు ముందే చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నెల 27న అనూప్‌ బాగ్చీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐసీఐసీఐ గ్రూపులో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు బాధ్యతలు చేపట్టే సమయానికే ఈ వివాదం సవాలుగా మారే అవకాశముంది. ఇటీవల బ్యాంకు ఛైర్మన్ చక్రవర్తి రాజీనామా చేయడం, ప్రస్తుత సీఈఓ శశిధర్‌ జగదీశన్‌తో పాటు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కైజాద్‌ భరూచా పదవుల నుంచి వైదొలగాలని నిర్ణయించుకోవడం వంటి ఉన్నతస్థాయి మార్పుల మధ్య ఈ లీకేజీ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *