Breaking News

సర్పంచ్ స్థానంలో భర్త పెత్తనం.. గ్రామాభివృద్ధి కుంటుపడుతోందని వార్డు సభ్యుల ఆవేదన!

సర్పంచ్, కార్యదర్శి తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు

గ్రామ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు

సర్పంచ్ కుటుంబ సభ్యుల దౌర్జన్యంతో ఇబ్బందులు పడుతున్నామని వార్డు సభ్యుల ఆవేదన

రుద్రూరు, అక్టోబర్ 27 (E6tv న్యూస్).

గ్రామానికి సర్పంచ్ ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని, గ్రామ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం సులేమాన్ నగర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా, గ్రామపంచాయతీ కార్యదర్శికి వివరించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సర్పంచ్ గ్రామపంచాయతీ కార్యాలయానికి సక్రమంగా రావడం లేదని, ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోయారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన వార్డు సభ్యులకే సమస్యలు ఎదురవుతుంటే, గ్రామ ప్రజల ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు.

సర్పంచ్ స్థానంలో భర్త పెత్తనం!

ఎన్నికైన మహిళా సర్పంచ్‌కు బదులుగా ఆమె భర్త, కుటుంబ సభ్యులు గ్రామపంచాయతీ వ్యవహారాల్లో పెత్తనం చెలాయిస్తున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. సర్పంచ్ భర్త, ఆమె సోదరులు తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని, ఇష్టానుసారంగా మాట్లాడి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి సైతం వారికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కారణంగా గ్రామాభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సమాచారం లేకుండానే పంచాయతీ పనులు!

గ్రామసభలు, వార్డు సభ్యుల సమావేశాల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని వార్డు సభ్యులు ఆరోపించారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పంచాయతీ పనులు చేపడుతున్నారని తెలిపారు. ఎన్నికలు జరిగి ఏడాది గడిచినా ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే బాడీ మీటింగ్ నిర్వహించారని, సమావేశం ఉన్న రోజే ఉదయం అకస్మాత్తుగా ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు.గ్రామపంచాయతీలో నోటీసులు సక్రమంగా ప్రదర్శించడం లేదని, ముఖ్యమైన సమాచారాన్ని వార్డు సభ్యులకు తెలియజేయడం లేదని ఆరోపించారు. సర్పంచ్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ప్రజల సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.

అధికారుల సమక్షంలోనూ వేధింపులా?

గ్రామ సమస్యలను మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం లభించడం లేదని వార్డు సభ్యులు తెలిపారు. గతంలో ఎంపీవో గ్రామపంచాయతీకి వచ్చిన సమయంలో కార్యదర్శి, సర్పంచ్ భర్త, ఆమె సోదరుడి సమక్షంలో సమస్యలపై చర్చ జరిగిందని చెప్పారు. ఆ సమయంలో సర్పంచ్ కుటుంబ సభ్యులు తమపై ఆగ్రహంగా వ్యవహరించి భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు.గ్రామంలోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారాయని, తమ వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించలేకపోతున్నామని వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్టర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి

సులేమాన్ నగర్ గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని వార్డు సభ్యులు కోరారు. గ్రామపంచాయతీ పాలన పారదర్శకంగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని, సర్పంచ్ ప్రజలకు, వార్డు సభ్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గ్రామసభలు, బాడీ మీటింగ్‌లు నిబంధనల ప్రకారం నిర్వహిస్తూ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు.

గ్రామపంచాయతీ పాలనపై వార్డు సభ్యులు చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలను పరిశీలించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *