ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం కరీంనగర్ నుంచి సిరిసిల్ల చేరుకోనున్న సీఎం, అంబేద్కర్ చౌరస్తా నుంచి ఫూలే, నేతన్న విగ్రహాలను సందర్శిస్తూ బహిరంగ సభా వేదిక వరకు పాదయాత్రగా వెళ్లనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందులో సిరిసిల్లలో నేతన్న బజార్, రూ.200 కోట్లతో సిరిసిల్ల మరియు వేములవాడలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాభివృద్ధికి రూ.99.40 కోట్ల పనులకు, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలకు, వేములవాడలో మహిళా మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పెద్దూరులో నిర్మించిన ఇందిరా మహిళా శక్తి భవన్‌ను సీఎం ప్రారంభించనున్నారు.

