ఎన్నికల సంఘం (ECI) కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఆన్‌లైన్ ‘ఫామ్ 6’లో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిందని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మార్పులు చట్టవిరుద్ధమని కేంద్ర ఎన్నికల కమిషనర్లే రికార్డు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ— “ఈ మార్పులు చేయాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)ను ఎన్నికల సంఘంలో ఎవరు ఆదేశించారు? టీసీఎస్‌లో దీనిపై సంతకం చేసిన అధికారి ఎవరు? వారిపై ఏమైనా ఒత్తిడి తీసుకువచ్చారా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ వివాదంపై ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ… ఈసీఐనెట్ (ECINET) పోర్టల్‌లోని ఫామ్ 6లో మునుపటి ఓటర్ల జాబితా (SIR)కు సంబంధించి అదనపు డిక్లరేషన్‌ను ఎవరి అనుమతి లేకుండా చేర్చారని, దీనిపై ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని రాహుల్ తెలిపారు. కాగా, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా ‘సేవ్ డెమోక్రసీ’ నిరసన ప్రదర్శనలు చేపడతామని ఇండియా కూటమి (INDIA Bloc) నేతలు ఇప్పటికే ప్రకటించారు.

